కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్రం గెజిట్.. తెలంగాణ తీవ్ర ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో సహా అన్నింటి నిర్వహణ ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి.

ప్రధానాంశాలు:బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచన.అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్న బోర్డుల నిర్వహణ.తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధానితో చర్చించడానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు, దీనిపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. జల వివాదాలపై సీఎం కేసీఆర్‌ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. నీళ్ల లెక్క తేలాకే విధివిధానాలు ప్రకటించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య బిగుసుకుంటున్న జల వివాదంపై దృష్టి సారించిన కేంద్రం.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ గెజిట్లు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వాహణను బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది.

గతేడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌ ప్రకారం బోర్డు పరిధికి సంబంధించిన అంశాలను నిర్ధారించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ -2 ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు ఇంకా ఖరారు కానందున.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేస్తారు.. కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చాక దాని ప్రకారం సవరణలు జరుగుతాయి.

పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేనందున, ప్రస్తుత ట్రైబ్యునల్‌ ప్రకారం కేటాయింపులకు రెండు రాష్ట్రాలు ప్రయత్నించాలి. తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్వహణ కూడా బోర్డు చూస్తుంది. (నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి., వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు 11వ షెడ్యూలులో ఉన్నాయి).

గోదావరి బోర్డుకు సంబంధించి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న (అనుమతులు వచ్చిన) ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి చేరాయి. నిర్మాణంలో ఉన్నవి, కొత్తవి, భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందిన తర్వాత గెజిట్‌లో చేర్చుతుంది. 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో రెండు రాష్ట్రాలతో దీనిపై కేంద్రం చర్చించినట్లు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కేటీఆర్ ఎవరు.. కేసీఆర్ కొడుకా..?: షర్మిల షాకింగ్ కామెంట్స్

Fri Jul 16 , 2021
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు కేటీఆర్ ఎవరో తెలియదని అన్నారు. పక్కనే ఉన్న నేతలు కేసీఆర్ కొడుకు అనగానే ఆయనా? అంటూ నవ్వేశారు.