ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

ప్రధానాంశాలు:భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో యాత్ర.కుటుంబపాలన అంతం కావాలన్న కిషన్ రెడ్డి.మాఫియా తెలంగాణగా మారిపోయిందని ఆరోపణ.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర శనివారం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యింది. యాత్ర ప్రారంభానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

కుటుంబ, అరాచక, అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ అండగా ఉందని చెప్పడానికే యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తామని, వారు పట్టించుకోకుంటే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలను యాత్రలో ప్రజలకు వివరించి, వారి ఆశీర్వాదం కోరుతామన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకే సంగ్రామ యాత్రను చేపట్టామని తెలిపారు. అమ్మవారి ఆశీర్వదంతో ముందుకు సాగుతామని ఎంపీ చెప్పారు.

రాష్ట్రంలోని దళితులను దళితబంధు పేరుతో.. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కేసీఆర్ మోసం చేస్తున్నాారని ఆరోపించారు. తెలంగాణలోని 90 శాతం మంది హిందువులను కాపాడే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపడానికి, వారికి అండగా ఉండటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఎంపీ బండి సంజయ్‌‌ అన్నారు.

యాత్ర ప్రారంభానికి ముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌తో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబపాలన అంతం కావాలని అన్నారు. రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని మండిపడ్డారు.

అమలుకాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, బంగారు తెలంగాణను మాఫియా తెలంగాణగా మార్చేశారని దుయ్యబట్టారు. బీజేపీ సునామీలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకుందని ఆరోపించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు.

ఇక, తొలి రోజు పాదయాత్ర హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల మేర సాగుతుంది. శనివారం రాత్రి మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు. నాలుగు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అమెజాన్ శుభవార్త.. క్రెడిట్ కార్డు లేని వారి కోసం కొత్త సేవలు?

Sat Aug 28 , 2021
అమెజాన్ కస్టమర్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తోంది. క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా బై నౌ పే లేటర్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.