స్టాలిన్ మరో సంచలన నిర్ణయం.. ప్రభుత్వ స్కూల్స్‌లో చదివితే 7.5 శాతం రిజర్వేషన్

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మే నెలలో బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు నుంచే స్టాలిన్ విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించి మన్ననలు అందుకుంటున్నారు.

ప్రధానాంశాలు:ప్రొఫెషనల్ కోర్సులకు తగ్గిపోతున్న ఆదరణ.ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే రిజర్వేషన్లు.సీఎం స్టాలిన్ నిర్ణయానికి ఏకగ్రీవ ఆమోదం.సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో గురువారం అన్ని పార్టీలు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. వృత్తివిద్యా కోర్సులకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటంతో అధ్యయనం కోసం నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మురుగేశన్‌ కమిటీ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నివేదికను అందజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి 10శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రభుత్వ విద్యార్థులకు రిజర్వేషను కల్పించే ముసాయిదా బిల్లును స్టాలిన్ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. బిల్లుపై ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా తాము కోరుకొన్న ఉన్నత విద్యను అభ్యసించడం పేదలకు కష్టతరంగా మారిందని అన్నారు. వృత్తివిద్యలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాల ఆధారంగా వివరించారు. సీఎం ప్రవేశపెట్టిన ముసాయిదాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు.

వైద్య విద్యలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్లు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. అటు, ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటి వద్దే విద్య, వైద్యం, అవసరమైన ఔషధాలను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుట్టుకతో వివిధ లోపాల కారణంగా 18 ఏళ్ల వరకు పాఠశాలలకు రాలేని స్థితిలో 7,726 మంది ఉన్నారని డీఎంకే ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు విద్యతోపాటు వైద్యం అందించేలా పథకం తీసుకు రానున్నట్లు సీఎం తెలిపారు.

విద్యార్థికి రూ.10వేల చొప్పున 7,786మంది కోసం రూ.7.80కోట్ల వ్యయంతో పథకం ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. అలాగే, తిరువణ్ణామలై ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలలకు కలైంజ్ఞర్‌ కరుణానిధి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌గా పేరు మార్చారు. డీఎంకే ఎమ్మెల్యే శరవణన్‌ అసెంబ్లీ చేసిన విన్నపం మేరకు ఆమోదిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సోనూసూద్‌కి మరో గౌరవం.. ఆయన సేవలు చూసి అరుదైన స్థానం ఇచ్చిన దిల్లీ సీఎం

Fri Aug 27 , 2021
కరోనా వ్యాప్తి ఆరంభం జరిగిన రోజు నుంచి ప్రజలకు ఎంతగానో సహాయం చేస్తూ.. రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. ఆయన చేస్తున్న ఈ సమాజసేవకులకుగాను ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా మరో అవార్డు కూడా ఆయనకు దక్కింది.