Taliban ప్రభుత్వంలో తీవ్రమైన అంతర్గత కుమ్ములాట.. అలకబూనిన బరాదర్!

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. పది రోజుల కిందట తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, ఇంత వరకూ క్యాబినెట్ ప్రమాణస్వీకారం జరగలేదు.

ప్రధానాంశాలు:బాలారిష్టాలు దాటని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం.క్యాబినెట్ కూర్పుపై ముల్లా బరాాదర్ తీవ్ర అసంతృప్తి.పదవి చేపట్టడానికి అంగీకరించని మరో మంత్రి.అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్థాన్‌‌లో తాలిబన్లు మళ్లీ పాగా వేశారు. అయితే, తాలిబన్లు ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనే తొలుత విబేధాలు తలెత్తాయి. ఈ విషయంలో పాకిస్థాన్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సహకరించింది. కానీ, తాత్కాలిక క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కుమ్ములాటలు మరింత పెరిగినట్లు సమాచారం.

అమెరికాపై ఉగ్రదాడికి ముందు అధికారంలో ఉన్న తాలిబన్లు అరాచక పాలన సాగించారు. ఈసారి తమ పాలన అందర్నీ మెప్పించేలా ఉంటుందని అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు ప్రకటించారు. అన్ని వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.

తాత్కాలిక ప్రభుత్వంలో ఐక్యరాజ్యసమితి, అమెరికా నిషేధిత జాబితాలోని కరడుగట్టిన ఉగ్రవాదులే మంత్రులుగా నియమితులయ్యారు. ఈ నియామకాలపైనే తాలిబన్లలోని ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఈ విషయమైన ఇరు వర్గాల మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగినట్టు ప్రచారం జరిగింది. ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఘర్షణలో మృతిచెందారని కూడా ఇటీవల వార్తలొచ్చాయి.

అయితే, తాను బతికే ఉన్నానంటూ తొలుత ఓ ప్రకటన విడుదల చేసిన బరాదర్‌.. బుధవారం ఓ వీడియోలో కనిపించారు. ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా క్యాబినెట్‌ ఏర్పాటు కావడం బరాదర్‌కు నచ్చడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందుకే డిప్యూటీ ప్రధాని పదవిలో కొనసాగుతున్నప్పటికీ పలు అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని తెలిపాయి. రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఖతార్ నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుర్‌ రహమాన్‌ అల్‌-థనీ అఫ్గన్‌ పర్యటనకు రాగా.. ఆయనకు స్వాగత కార్యక్రమానికి బరాదర్‌ దూరంగా ఉన్నారు.

అమెరికాతో శాంతి ఒప్పందంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం అలకబూని అంటీముట్టనట్టుగా వ్యవహరించడం తాలిబన్‌ సర్కారుకు ఇబ్బందికరంగా మారే అవకాశముందని పేర్కొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తర్వాత సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తొలి తాలిబన్ సీనియర్ నేత బరాదర్. ఇక, రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అఫ్గన్ అధ్యక్ష భవనంపై జాతీయ జెండా స్థానంలో తాలిబన్లు వారి జెండాను ఎగురవేశారు.

ఈ విషయమై కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెండాపై తమ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చివరికి రెండింటినీ పక్కపక్కనే ఎగరేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని తాలిబాన్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్గత అంశాలను మీడియాతో చర్చించడానికి అనుమతించనందున ఆయన తన పేరును వెల్లడించలేదు.

అటు, పదవుల విషయంలోనూ ఇద్దరు నేతల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోని జాతి, మతపరమైన మైనారిటీలను త్యజించిన తాలిబాన్ ప్రభుత్వంపై ఓ క్యాబినెట్ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తన పదవిని చేపట్టడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kohli ఎందుకు తొందరపడ్డావ్..? ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే: ఇర్ఫాన్ పఠాన్

Fri Sep 17 , 2021
టీ20 వరల్డ్‌కప్ ముంగిట విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా టీ20 వరల్డ్‌కప్ తనకి ఆఖరిదని చెప్పుకొచ్చిన కోహ్లీ.. ఆపై బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కానీ..?