అసమ్మతిని అణచివేతకు చట్టాల దుర్వినియోగం తగదు.. సుప్రీం జడ్జ్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుంటుందని, అటువంటి వారిపై ఉగ్రవాద చర్యలను నియంత్రించే చట్టాలను ప్రయోగించడం సమంజసం కాదని న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

ప్రధానాంశాలు:తీవ్రమైన నేరాల కట్టడికి కఠిన చట్టాలు.నిరసనలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ప్రయోగం.దుర్వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆందోళన.దేశంలో పౌరుల అసమ్మతిని అణచివేయడానికి ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సోమవారం జరిగిన ఇండో-అమెరికన్ సమ్మర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్.. ఇరు దేశాల మధ్య న్యాయ సంబంధాల అంశంపై జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు.

‘ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు సహా క్రిమినల్ చట్టాలను అసమ్మతిని అణచివేయడం లేదా పౌరులను వేధించడానికి దుర్వినియోగం చేయకూడదు.. అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసు విచారణ సందర్భంగా నా తీర్పులో నేను గుర్తించినట్లు.. న్యాయస్థానాలు పౌరుల స్వేచ్ఛకు రక్షణగా మొదటి వరుసలో నిలబడేలా ఉండాలి’ అని అన్నారు. ‘ఒక్క రోజు కూడా స్వేచ్ఛను కోల్పోవడం చాలా ఎక్కువ.. మన నిర్ణయాలు వ్యవస్థలోని లోతైన సమస్యల గురించి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

భీమా-కొరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన 84 ఏళ్ల సామాజిక హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మృతిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఏడాదిన్నర కిందట ఉపా చట్టం కింద అరెస్టయిన అసోం కాంగ్రెస్ నేత అఖిల్ గొగొయ్‌ ఇటీవల విడుదలయిన విషయం తెలిసిందే. సీఏఏ-2019కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన అఖిల్ గొగొయ్‌ను ఉపా చట్టం కింద ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉపా చట్టం దుర్వినియోగంపై తన పోరాటం సాగుతోందని జైలు నుంచి విడుదలయిన తర్వాత అఖిల్ ప్రతిజ్ఞ‌ చేశారు.
మరో కేసులో 11 ఏళ్ల కిందట అరెస్టయిన కశ్మీర్‌కు చెందిన నేత కొద్ది వారాల కిందటే విడుదలయ్యారు. ఆయనకు నేరంతో సంబంధం లేదని తేలడంతో విడిచిపెట్టారు.

సోమవారం నాటి సమావేశంలో భారత్-అమెరికా సంబంధాలపై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ, భావప్రకటన, మత శాంతిని ప్రోత్సహించడంలో అమెరికా ఆద్యుడిగా నిలిచిందన్నారు. ఈ సమావేశాన్ని అమెరికా బార్ అసోసియేషన్‌కు అంతర్జాతీయ లా విభాగం, చార్టెర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బిటరేటర్స్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్ సంయుక్తంగా నిర్వహించాయి.

‘ప్రపంచంలోనే భారత్ పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. బహుళ సాంస్కృతిక, బహుళ సమాజం ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది.. ఇక్కడ రాజ్యాంగాలు మానవ హక్కులకు లోతైన నిబద్ధత, గౌరవం మీద దృష్టి సారించాయి’ అని ఆయన తెలిపారు. భారత్, అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ‘స్వయం ప్రతిపత్తి అత్యంత శక్తివంతమైన’విగా గుర్తింపు పొందాయి’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘భారతీయ న్యాయ శాస్త్రంపై అమెరికా ప్రభావం తక్కువని చెప్పలేం’ అని నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Yashpal Sharma ట్రెండ్ సెట్టర్.. 1983 వరల్డ్‌కప్‌లో 6, 6 (వీడియో)

Tue Jul 13 , 2021
1983 వరల్డ్‌కప్‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే భీకరమైన వెస్టిండీస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొన్న యశ్‌పాల్ శర్మ.. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బౌలర్లకి చెమటలు పట్టిస్తూ భారీ సిక్సర్లు బాదాడు.