ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఆ వివాదాస్పద పరిశ్రమ తెరవడానికి సుప్రీం అనుమతి!

ఆక్సిజన్ కోరతను అధిగమించడానికి పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి ఆస్పత్రులకే అందజేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని స్టీల్ ప్లాంట్ల నుంచి ప్రాణవాయువును సరఫరా చేస్తున్నారు.

ప్రధానాంశాలు:దేశంలో ఆక్సిజన్ కొరతతో జాతీయ సంక్షోభం.వివాదాస్పద ఫ్యాక్టరీని తెరవడానికి అనుమతి.మూడేళ్ల తర్వాత తెరుచుకోనున్న స్టెరిలైట్. జాతీయ సంక్షోభం నెలకుందని, తూత్తుకూడి స్టెరిలైట్ పరిశ్రమలో ఆక్సిజన్ ఉత్పత్తికి వేదాంత యాజమాన్యానికి సుప్రీంకోర్టు అనుమతించింది. స్టెరిలైట్ పరిశ్రమలో జులై 15 వరకు ఆక్సిజన్ ఉత్పత్తికి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు వెలువరించింది. ఆ తర్వాత అవసరమైతే కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఆక్సిజన్ ఉత్పత్తి పర్యవేక్షణకు ట్యూటికోరిన్ కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా సర్వోన్నత న్యాయస్థానం నియమించింది.

తమిళనాడు ప్రభుత్వం నుంచి విద్యుత్‌ను కొనుగోలుచేసి ఉత్పత్తి ప్రారంభించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీందర్ భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ‘‘ఇది జాతీయ సంక్షోభం.. ప్రజల ప్రాణాలను కాపాడటానికి జాతీయ న్యాయస్థానంగా మనం అంతా చేయాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయ విపత్తువేళ ఆక్సిజన్ ఉత్పత్తిచేసి ఉచితంగా సరఫరా చేస్తామని వేదాంత సంస్థ కోర్టుకు తెలియజేసింది.

మూడేళ్లుగా ఈ పరిశ్రమను మూసివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా రోగులు భారీగా పెరగడంతో తీవ్ర ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దీంతో దేశంలోని స్టీల్ ప్లాంట్ల నుంచి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అయినప్పటికీ ఆక్సిజన్ సరిపోక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం తూత్తుకుడిలో వేదాంత స్టెరిలైట్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలని రెండు రోజుల కిందట నిర్ణయించింది. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్‌ను నాలుగు నెలల పాటు తాత్కాలికంగా తెరవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.

4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 1995లో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉంది. ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని ఉద్యమాలు కొనసాగించారు. 2018 మే 22న తూత్తుక్కుడి వాసులు స్టెర్లైట్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు 100 రోజులు పూర్తయిన సందర్భంగా, పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అది హింసాత్మకంగా మారింది.

పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు అదుపుతప్పడం వల్లనే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అప్పట్లో పోలీసులు, ప్రభుత్వాధికారులు సమర్థించుకున్నారు. అయితే పోలీసు కాల్పులపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ప్లాంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రేయ్ ఏమన్నార్రా, ముందుంది మొసళ్ల పండగ.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

Tue Apr 27 , 2021
తాను వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌కు అర్హత ఉందని కోర్టు విచారణకు స్వీకరించిందని ఎంపీ చెప్పారు. సీఎం జగన్, సీబీఐకి నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయమంటారని చెప్పుకొచ్చారు.