SCO Summit అఫ్గన్ పరిణామాలను ఉటంకిస్తూ పాక్, చైనాలకు మోదీ చురకలు!

తజికిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా జరుగుతున్న షాంఘై సహకార కార్పొరేషన్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపాకిస్థాన్, చైనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానాంశాలు:ఎస్‌సీఓ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని.ఉగ్రవాదం విషయంలో ఉమ్మడి పోరాటానికి పిలుపు.మధ్య ఆసియా చరిత్రలను తెలుసుకోవాలని సూచన.పెరుగుతున్న తీవ్రవాదం, వేర్పాటువాదం ప్రపంచ శాంతికి పెను విఘాతంగా పరిణమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తజకిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో ప్రధాని వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. శాంతి, భద్రత, పరస్పర నమ్మకలోపం వంటి సవాళ్లను ఈ ప్రాంతం ఎదుర్కొంటోందని చెప్పారు. ఆఫ్గన్ పరిస్థితులను ప్రస్తావించిన ఆయన.. పెరుగుతున్న తీవ్రవాదం ఈ సమస్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

అఫ్గనిస్థాన్‌లో ఇటీవలి పరిణామాలు ఈ సవాళ్లను నొక్కి వక్కాణిస్తున్నాయని వివరించారు. ఎస్‌సీఓ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని, ఈ సంస్థ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయమని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రాంతీయ స్థిరత్వంపై భారత్ ఆందోళనలను ప్రధాని ప్రస్తావించారు. అనుసంధానం, విశ్వాసం వంటి సమస్యలపై కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని చైనా, పాకిస్థాన్ సహా ఎస్‌సీఓ సభ్య దేశాలను కోరారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన తజకిస్థాన్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిభావంతులైన యువతను సైన్స్, హేతుబద్ధ ఆలోచనల దిశగా ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం రంగంలో భారత్‌ను భాగస్వామిగా చేసే దిశగా సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపించేలా స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూవర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చామని చెప్పారు. మధ్య ఆసియాతో అనుసంధానాన్ని పెంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. భారతదేశ విస్తృత స్థాయి మార్కెట్‌తో అనుసంధానం వల్ల మధ్య ఆసియా దేశాలకు గొప్ప ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.

‘చరిత్రను పరిశీలిస్తే మితవాద, ప్రగతిశీల సంస్కృతులు, విలువలకు కంచుకోటగా మధ్య ఆసియా ఉందని తెలుస్తుంది.. శతాబ్దాలుగా ఇక్కడ అభివృద్ధి చెందిన సూఫీవాదం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ ప్రాంతం సాంస్కృతిక వారసత్వంలో మనం ఇప్పటికీ వాటిని చూడవచ్చు.. మధ్య ఆసియా చారిత్రక వారసత్వం ఆధారంగా SCO తీవ్రవాదంపై పోరాటానికి ఉమ్మడి వేదికను రూపొందించాలి… భారత్ సహా ఎస్‌సీఓలోని దాదాపు అన్ని దేశాలు మితవాద, సహనంతో కూడిన సమగ్రమైన సంస్థలు, ఇస్లాంకు సంబంధించిన సంప్రదాయాలు ఉన్నాయి’ అన్నారు.

ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ దుషాంబే వెళ్ళారు. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం, దానివల్ల అంతర్గత, బాహ్య ప్రభావాలు, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన సమస్యలపై ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు చర్చిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

డాక్టర్‌గా మారిన యాక్టర్.. థ్రిల్లింగ్‌గా ఉందంటోన్న రకుల్

Fri Sep 17 , 2021
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లో ఆఫర్లు లేవంటూ రకుల్ మీద వచ్చిన ఆరోపణలు ఆ మధ్య ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.