పుట్టినరోజు వేడుకల్లో క్రిమినల్‌‌కు కేక్ తినిపిస్తున్న పోలీస్ అధికారి.. వీడియో వైరల్!

హత్యాయత్నం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కరుడగట్టిన క్రిమినల్‌కు పుట్టిన రోజు వేడుకల్లో కేక్ తినిపించిన ఓ వీడియో వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరుడగట్టిన నేరస్థుడికి ఓ పోలీస్ అధికారి కేక్ తినిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వారాల కిందటి ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు గురువారం విచారణకు ఆదేశించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేరస్థుడు డానిష్ షైక్‌కు ముంబయిలోని జోగేశ్వరి పోలీస్ స్టేషన్‌లో సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర నెర్లింకర్ కేక్ తినిపిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా ఉంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పోలీస్ అధికారి.. నేరస్థుడికి కేక్ తినిపించాడు.

డానిష్ షైక్‌పై హత్యాయత్నం సహా పలు కేసులు ఉన్నాయి. గతంలో జోగేశ్వర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. యూనిఫామ్‌లో నేరస్థుడికి పోలీస్ అధికారి కేక్ తినిపించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పోలీస్ అధికారి మహేంద్ర వివరణ ఇచ్చారు. ఇది పాత వీడియో అని హౌసింగ్ సొసైటీలో కూల్చివేత పనులు జరుగుతుండగా.. పర్యవేక్షణకు వెళ్లిన సందర్భంలోనిదని అన్నారు.

ఇదే సమయంలో అక్కడ ఉన్న కొందరు సీనియర్ సిటిజన్లు సొసైటీ కార్యాలయాన్ని సందర్శనకు రావాలని పట్టుబట్టారని తెలిపారు. వారి మాటను కాదనలేక అక్కడకు వెళ్లానని, కానీ డానిష్ అక్కడ ఉన్న విషయం తనకు తెలియదన్నారు. అక్కడ తనతో కేక్‌ కట్ చేయించారని, ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి తినిపించానని స్పష్టతనిచ్చారు. దీనిపై పదో జోన్ డీసీపీ మహేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణకు ఆదేశించామని తెలిపారు. సకినాక డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో కొనసాగుతోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శ్రీ విశ్వ గురు పూర్ణిమ.. జులై 17 నుంచి 23 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రస్థాన సాధన

Fri Jul 16 , 2021
రాబోయే రోజుల్లో సమాజంలో మానవత్వం పెంపొందాలంటే గురు విశ్వస్ఫూర్తి వారు మానవాళికి అందించిన ఆసన, ప్రాణాయామ ధ్యాన విధానమే ఏకైక మార్గమని, స్ఫూర్తి సాధకులై కృషి చేయాలని చెబుతున్నారు.