కార్డియాక్ అరెస్ట్‌తో మాజీ సీఎం కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నా వెంటాడిన అనారోగ్యం

ఆరుసార్లు ఎంపీగా, ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత.. అనారోగ్యంతో కన్నుమూశారు. వయసుపై బడటంతో అనారోగ్యం వెంటాడింది.

ప్రధానాంశాలు:28 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నిక.సీఎంగా ఆరుసార్లు పనిచేసిన సింగ్.ఎమ్మెల్యేగా తొమ్మిది సార్లు విజయం.హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లుకాగా.. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కోవిడ్ నుంచి కోలుకున్నా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఏప్రిల్ 30న ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్న మాజీ సీఎం ఆరోగ్యం క్షీణించడంతో రెండు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు వీరభద్ర సింగ్ కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

రెండుసార్లు కోవిడ్ బారినపడి కోలుకున్నారు.. కానీ, ఆయనకు న్యూమోనియా తీవ్రమైందని వైద్యులు తెలిపారు. వయసు పైబడటంతో ఆయన అనారోగ్య నుంచి కోలుకోలేకపోయారని పేర్కొన్నారు. రెండు రోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించామని, అయినా మెరుగుపడలేదన్నారు. వీరభద్ర సింగ్‌ను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, గురువారం తెల్లవారుజామున చనిపోయారని ఇందిరా గాంధీ ఆస్పత్రి వైద్యుడు జానక్ రాజ్ చెప్పారు.

వీరభద్ర సింగ్ 1934 జూన్ 23న సిమ్లాలోని సరాహన్‌లో జన్మించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వీరభద్ర సింగ్.. తొలిసారిగా 1962 ఎన్నికల్లో పోటీచేసి 28 ఏళ్లకే ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1967, 1971, 1980, 2009 ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. 1977 నుంచి 80, 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983 నుంచి 2017 వరకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే 1983, 1985, 1990, 1993, 1998, 2003, 2007, 2012, 2017లో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కశ్మీర్‌లో మరో విజయం..హిజ్బుల్ టాప్ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం!

Thu Jul 8 , 2021
కశ్మీర్‌లో భద్రత బలగాలు ముష్కరుల భరతం పడుతున్నాయి. వరుస దాడులతో ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సైన్యం.. తీవ్రవాదులను వేటాడుతోంది.