కెయిర్న్ ఎనర్జీ కేసులో ఎదురుదెబ్బ.. ఫ్రాన్స్‌లో భారత ఆస్తుల జప్తునకు ఫ్రెంచ్ కోర్టు ఆదేశం!

వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసి, రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేయడంతో ఆ సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీ సంస్థ వివాదంలో భారత్‌కు అంతర్జాతీయ కోర్టు 1.2 బిలియన్ డాలర్లు (రూ.8 కోట్లు) జరిమానాను విధించిన విషయం తెలిసిందే. ఇందులో కొంత మొత్తాన్ని పొందడానికి ఫ్రాన్స్‌లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కెయిర్న్ ఎనర్జీకి జూన్ 11 న ఫ్రెంచ్ కోర్టు ఆదేశించింది. ఇందులో ఎక్కువగా ఫ్లాట్లు ఉన్నాయని, బుధవారం సాయంత్రం చట్టపరమైన ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నాయి.

కెయిర్న్ ఎనర్జీకి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్) ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు పన్నులను చెల్లించాల్సిన అవసరంలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కోర్టులో భారత్ ఇటీవలి కాలంలో ఇది రెండో ఎదురుదెబ్బ. గతేడాది సెప్టెంబరులో వోడాఫోన్ గ్రూప్ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులో విజయం సాధించిన తరువాత ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో రెండు నెలల కిందట దావా వేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది.

సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. తాజాగా, ఫ్రాన్స్‌ కోర్టు తీర్పుతో అక్కడ భారత ఆస్తులు స్వాధీనం చేసుకోడానికి మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి 2006లో నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. అయితే, 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. అనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాల్ చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆ సంస్థకు అనుకూలంగా గతేడాది డిసెంబరులో తీర్పునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మాకు మంత్రి పదవి ఇవ్వరా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: బీజేపీకి మిత్రపక్షం హెచ్చరిక

Thu Jul 8 , 2021
ఎన్‌డీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని బుధవారం పునర్‌ వ్యవస్థీకరించారు. ఇందులో పలువురి మిత్రులకు చోటుదక్కింది.