నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తక్షణమే Govt Jobs భర్తీ.. KCR ఆదేశం

Pragathi Bhavan: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వారికి కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డకుంలు తొలగిపోయిన నేపథ్యంలో.. ఖాళీ భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే ఖాళీలను గుర్తించి మలి దశలో భర్తీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు కావొస్తున్న ఇప్పటి వరకూ భారీ స్థాయిలో ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టలేదు. స్వరాష్ట్రంలో కొలువు సాధన తేలికవుతుందని భావించిన నిరుద్యోగులకు ఇన్నాళ్లూ నిరాశే ఎదురైంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం తలెత్తడంతో.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి జోనల్ వ్యవస్థను రూపొందించామన్న సీఎం.. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంలో జాప్యమైందన్నారు. డైరెక్ట్‌గా రిక్రూట్ చేసే అన్ని ఉద్యోగాల కలిపి దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం తెలిపారు.

తెలంగాణలో ఇప్పటి వరకూ రెండు జోన్లు మాత్రమే ఉండగా.. వీటి స్థానంలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ పేరిట నూతనంగా ఏడు జోన్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్ పరిధిలోకి వస్తే.. రాజన్న జోన్‌ కిందకు కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు వస్తాయి.

వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భ‌ద్రాద్రి జోన్‌లో.. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు యాదాద్రి జోన్లోకి వస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు చార్మినార్‌ జోన్ పరిధిలోకి వస్తే.. జోగుళాంబ జోన్ పరిధిలోకి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్ జిల్లాలు వస్తాయి.

వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణించేవారు. కానీ ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర బడ్జెట్‌లోనే ఉండే అవకాశం!

Fri Jul 9 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఎం21 2021ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.