మే 2 తరువాతే కోవిడ్ కట్టడికి ఏ కఠిన నిర్ణయమైనా.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ?!

National health emergency దేశంలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రధానాంశాలు:ఆరోగ్య అత్యయిక పరిస్థితి విధింపుపై చర్చలు.మే 2 తర్వాతే ఎమర్జెన్సీపై నిర్ణయం.మరో వారం రోజుల తర్వాత స్పష్టత.దేశంలో కరోనా సునామీలో విరుచుకుపడుతోంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మే ప్రథమార్ధంలో మహమ్మారి తీవ్రత గరిష్ఠానికి చేరుకుంటుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక స్థితిని విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే కరోనా కట్టడి చర్యలపై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం కేంద్రం పరిధిలోకి వెళుతుంది. అయితే, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమైనా మే 2 తరువాత ఉంటుందని సమాచారం.

పశ్చిమ బెంగాల్‌లో మరో విడత పోలింగ్ మిగిలి ఉండగా, మే 2 ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ముగిసిన తరువాతే హెల్త్ ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, కోవిడ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కొరడా ఝలిపించడం సహా తదితరాలను తమ అధీనంలోకి తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ విధించే విషయంలో కేంద్రం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.

మరో వారం రోజుల తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి భారత రాజ్యాంగంలో నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీల ప్రస్తావన ఉందే తప్ప, ఆరోగ్య ఎమర్జెన్సీ అనే అంశమే లేదు. అయితే, ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలంటే, ఏ చట్టాలను వినియోగించుకోవచ్చన్న విషయంపై కేంద్ర పెద్దలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355ను కరోనా కారణంతో ప్రజల్లో రేకెత్తిన భయాందోళనలు తొలగించేందుకు, చట్టాలను ధిక్కరించే వారిని అణచివేయడానికి, అంతర్గత కల్లోలాలను రూపుమాపడానికి వాడుకునేందుకు వీలుంది.

ఇదే నిబంధనలను అనుసరించి హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తారు. సోషల్ మీడియాలోనూ కేంద్రానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టినా నేరంగా పరిగణిస్తారు. మీడియాలో సైతం వ్యతిరేకంగా వార్తలు రాయడానికి వీలుండదు. ఇందుకు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా? జగన్ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న!

Tue Apr 27 , 2021
కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న వేళ, ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో హైకోర్టులో కీలక విచారణ జరిగింది.