బ్రహ్మానందంకి అలాంటి పాత్ర.. దర్శకేంద్రుడి వినూత్న ప్రయోగం

బ్రహ్మానందం గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత ఆయన ‘జాతిరత్నాలు’ సినిమాలో జడ్జి పాత్రలో కనిపించి తన హావభావాలతోనే నవ్వులు పూయించారు. అయితే ఇప్పుడు బ్రహ్మానందంతో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు ఓ వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారట.

హాస్య బ్రహ్మ బ్రహానందం తెలుగు ప్రేక్షకులే కాదు.. తన నటనతో యావత్ భారత సినీ అభిమానుల మనస్సులో చోటు సంపాదించుకున్నారు. బ్రహానందం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్లు ఈలలు, గోలతో మారుమోగిపోవాల్సిందే. ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. స్క్రీన్‌పై బ్రహ్మానందం కనిపిస్తే వచ్చే మజానే వేరు. అంతలా ప్రేక్షకులపై ముద్ర వేశారు ఆయన. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. అనారోగ్యంతో చాలాకాలం ఆయన వెండితెరపై కనిపించలేదు.

అయితే ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో ఆయన జడ్జి పాత్రలో కనిపించారు. ఒకే చోటే కూర్చొని ఆయన తన హావభావాలతో నవ్వులు పూయించారు. బ్రహ్మానందంని వెండితెరపై చూసిన ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. ఇక ఆయన త్వరలో కే.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘పెళ్లి సందD’ అనే సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. అయితే ఈ సినిమాలో బ్రహ్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట.

రాఘవేంద్ర రావు, బ్రహ్మానందంల సంబంధం ఇప్పటిది కాదు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని దాదాపు సూపర్ హిట్లు అయ్యాయి. తాజాగా ‘పెళ్లి సందD’లో బ్రహ్మానందంతో ఓ వినూత్న ప్రయోగం చేసేందుకు రాఘవేంద్రరావు రెడీ అవుతున్నారట. జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను చేసిన ‘బిల్డప్‌ బాబాయ్’ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకూ ప్రతీ ఒక్కరు తనకు తెలుసూ.. అంటూ.. తను తలచుకుంటే చేయలేని పని ఏదీ లేదు అని గొప్పలు చెప్పుకొనే పాత్ర అది.

అయితే ఇప్పుడు ఈ ‘పెళ్లి సందD’ సినిమాలో బ్రహ్మానందంతో అలాంటి పాత్ర చేయిస్తున్నారట దర్శకేంద్రుడు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర‌వాణి బాణీలు కడుతున్నారు. రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యిందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

లోకేష్‌కు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు.. పేటీఎం కుక్కలు, జఫ్ఫాస్ అంటూ ఓ రేంజ్‌లో..!

Sun Apr 25 , 2021
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.