పసివాడి ప్రాణం కోసం అథ్లెట్ పతకం వేలం.. హార్ట్ టచింగ్ స్టోరీ

ఒలింపిక్స్‌లో పతకం ప్రతి అథ్లెట్ కల. అలాంటి పతకాన్ని ఎలాంటి సంబంధం లేని ఓ పసివాడి ప్రాణం కాపాడేందుకు వేలానికి ఉంచితే..? వేలంలో పతకాన్ని దక్కించుకున్న కంపెనీ…

ప్రధానాంశాలు:గొప్ప మనసు చాటుకున్న పోలాండ్ అథ్లెట్టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం (జావెలిన్ త్రో)ఆ పతకాన్ని ఓ 8 నెలల పసివాడి ప్రాణం కోసం వేలం ఆ పతకాన్ని దక్కించుకున్న కంపెనీ దాతృత్వంపోలాండ్‌కి చెందిన అథ్లెటిక్ ఆండ్రెజిక్ గొప్ప మనసు మనసు చాటుకుంది. ఓ 8 నెలల పసివాడి ప్రాణం నిలిపేందుకు తాను ప్రాణం పెట్టి సాధించిన ఒలింపిక్ పతకాన్ని వేలం వేసింది. వేలంలో ఆ పతకాన్ని దక్కించుకున్న ఓ కంపెనీ.. ఆ తర్వాత ఆండ్రెజిక్ మంచి మనసుని అర్థం చేసుకుని.. ఆ కంపెనీ కూడా దాతృత్వం చాటుకుంది. హృదయాన్ని హత్తుకునే కథనం మీ కోసం..

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 64.61 మీటర్లు విసిరిన ఆండ్రెజిక్ రజత పతకాన్ని సాధించింది. పోలాండ్‌కు చెందిన ఆండ్రెజిక్.. 2016 రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు సెంటీమీటర్ల తేడాతో కాంస్య పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ తర్వాత రెండేళ్లకి ఆమెకు బోన్ క్యాన్సర్ సోకినట్లు తేలింది. అయినప్పటికీ.. ఏమాత్రం అధైర్యపడకుండా క్యాన్సర్‌ను జయించిన ఆమె.. పట్టుదలతో శ్రమించి.. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని ముద్దాడింది. మహమ్మారిని జయించి.. ఎంతో కష్టపడి సాధించిన ఈ పతకం ఆమెకెంతో ప్రత్యేకం.

కానీ.. ఓ పసివాడి ప్రాణం కోసం అపురూపమైన ఈ పతకాన్ని ఆమె వేలానికి పెట్టింది. అథ్లెట్‌గా తాను సాధించింది రజతమే అయినా.. తన మనసు బంగారం అని చాటుకుంది. బోన్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న పాతికేళ్ల ఆండ్రెజిక్‌కి ప్రాణం విలువేంటో తెలుసు. అందుకే గుండె సమస్యతో ప్రాణాల కోసం పోరాడుతున్న 8 నెలల పసివాడి కోసం తాను సాధించిన పతకాన్ని వేలానికి పెట్టింది.

చిన్నారి ఆపరేషన్‌ కోసం.. ఆండ్రెజిక్ తన ఒలింపిక్ రజత పతకాన్ని వేలానికి పెట్టగా.. జబ్కా అనే పొలిష్ గ్రాసరీ స్టోర్‌ చెయిన్ కంపెనీ లక్షా 25 వేల డాలర్లకి ఆ పతకాన్ని దక్కించుకుంది. ఈ డబ్బుతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో ఆ చిన్నారికి సర్జరీ నిర్వహించనున్నారు.

ఎంతో కష్టపడి సాధించిన ఒలింపిక్ పతకాన్ని వేలం వేశారు కదా.. మీకెలా అనిపిస్తుంది..? అని ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా.. ‘‘పతకం సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషానిచ్చింది. ఇప్పుడు ఆ ఆనందాన్ని చిన్నారికి అందిస్తున్నా’’ అని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకుంది.

‘‘సాధించిన పతకం అసలైన విలువ అనేది.. మన హృదయంలో చిరకాలం ఉంటుంది. పతకం అనేది కేవలం ఓ వస్తువు మాత్రమే. కానీ ఇతరలకు అది గొప్ప విలువైంది కావొచ్చు. నేను సాధించిన రజత పతకం ప్రాణాలను కాపాడుతుందనుకుంటే.. దాన్ని జాగ్రత్తగా దాచుకోవడం కంటే.. ప్రాణాలను నిలపడానికే ఉపయోగించడం మంచిది కదా. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కోసం వేలం వేయాలని నిర్ణయించుకున్నా’’ అని ఆండ్రెజిక్ చెప్పుకొచ్చింది.

ఓ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం ఆండ్రెజిక్ తపన.. పతకాన్ని వేలంలో దక్కించుకున్న జబ్కా కంపెనీని కదిలిచింది. వేలంలో తాము సొంతం చేసుకున్న పతకాన్ని తిరిగి ఆండ్రెజిక్‌కు ఇచ్చేసింది. అంతేకాకుండా లక్షా 25 వేల డాలర్లను చిన్నారికి సర్జరీ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మొక్కజొన్న కంకి, స్వీట్‌కార్న్.. రెండింటిలో ఏది మంచిదంటే..

Fri Aug 20 , 2021
దేశీబుట్ట అంటే మనకు వర్షాకాలంలో లభించే మొక్కజొన్న కంకులు అని అర్థం. అసలు చాలా మందిలో ఈ కంకులు తింటే మంచిదేనా అనే అనుమానం కలగడం సహజం.