రాష్ట్రమంతా ఒకేలా కర్ఫ్యూ.. మాస్క్ ధరించకపోతే రూ.100 ఫైన్: సీఎం జగన్ ఆదేశాలు

రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ప్యూపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఒకే మాదిరిగా కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. మాస్క్ ధరించని వారికి రూ.100 ఫైన్ వేస్తామని తెలిపారు.

ప్రధానాంశాలు:కర్ఫ్యూ అమలుపై సమీక్షించిన సీఎం జగన్ఇకపై రాష్ట్రమంతటా ఒకేలా కర్ఫ్యూమాస్కు ధరించకపోతే రూ.100 ఫైన్కోవిడ్ నియంత్రణకు అమలు చేస్తున్న కర్ఫ్యూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ ఒకే మాదిరిగా అమలు చేసేలా సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని, రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై మంత్రి ఆళ్ల నానితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సీఎం జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5% లోపలే ఉందని, అయినా మాస్కు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అందరూ మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీన్ని ఉల్లంఘిస్తే ఆ దుకాణాలకు జరిమానా విధించడమే కాకుండా అవసరమైతే రెండు, మూడు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానా విధించాలని, ఇందుకు ప్రత్యేకంగా వాట్సప్‌ నంబరు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్థులకు కాలేజీల్లోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి టీకాలు వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘పాఠశాలలు తెరిచేనాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. కరోనా థర్డ్ వేవ్ ఉందని సంకేతాలు వస్తున్నందున చిన్నపిల్లల వైద్యుల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు సిద్ధం చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ వంటి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉన్నందున పీహెచ్‌సీలు, ఏజెన్సీ ప్రాంత వైద్యులను అప్రమత్తం చేయాలి. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున అవసరమైన ఇంజెక్షన్లను సిద్ధంగా ఉంచాలి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు బెయిల్.. అంటిగ్వాకు పయనం

Tue Jul 13 , 2021
మూడేళ్ల కిందట భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ.. అంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే, అక్కడ నుంచి క్యూబాకు పారిపోయే ప్రయత్నంలో డొమినికాలో పట్టుబడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.