ఉత్తరాదిలో పిడుగులు బీభత్సం.. 68 మంది మృతి

ఉత్తర భారతదేశంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పిడుగులు చాలా మందిని పొట్టనబెట్టుకున్నాయి.

ప్రధానాంశాలు:రాజస్థాన్‌లో సెల్ఫీ పిచ్చికి 11 మంది బలి.యూపీలో వర్షాలకు 40 మంది వరకు మృతి.అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలు. ఉత్తర భారతదేశంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం పిడుగులు పడి 68 మంది చనిపోగా.. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. పిడుగుపాటు ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశుసంపదను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేస్తామని యోగి హామీ ఇచ్చారు.

రాజస్థాన్‌లోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు లోనై 20 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. జైపూర్ సమీపంలోని అంబర్ కోట వద్ద పర్యాటకులు సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. కోట, ధోల్పూర్, ఝావల్పూర్ జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా ఆరుగురు చిన్నారులు మరణించారు. పిడుగుల కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

పిడుగుపాటు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కాగా పిడుగులు పడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. పిడుగులు పడుతున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించింది.

పిడుగులు పడే సమయంలో సైకిళ్లు, బైకులు, ట్రాక్టర్లపై ప్రయాణించొద్దని తెలిపింది. మెటల్ షెడ్లు, పార్కింగ్ ఏరియా, నిర్మాణంలో ఉన్న భవనాలు, వరండాల్లో ఉండటం సురక్షితం కాదని స్పష్టం చేసింది. చెట్ల కింద తలదాచుకోవద్దని.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎత్తు తక్కువగా ఉన్న చెట్ల కిందకు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. సమీపంలో తలదాచుకోవడానికి భవనాలు లేకపోతే.. నిలబడి ఉండకుండా.. రెండు మోకాళ్ల మధ్యలో తల ఉండేలా కూర్చోవాలని.. నేలపై పడుకోవడం, నీళ్లపై ఉండటం లాంటి పనులు చేయొద్దని సూచించింది. పశువులను ఆరుబయట కట్టేయొద్దని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.30 పొదుపుతో రూ.4 లక్షలు పొందండి.. ఎల్‌ఐసీ అదిరే పాలసీ!

Mon Jul 12 , 2021
మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక పాలసీ అందుబాటులో ఉంది. తక్కువ ప్రీమియంతోనే మీరు రెండు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. రక్షణ, రాబడి లభిస్తాయి.