బీజేపీ నేత వాహనం అడ్డగింత.. 100 మంది రైతులపై దేశద్రోహం కేసు!

రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిన రోజే దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రధానాంశాలు:వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన.హరియాణాలో బీజేపీ నేత వాహనం అడ్డగింత.సుప్రీం వ్యాఖ్యలు చేసిన రోజే వెలుగులోకి కేసు.కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరియాణా డిప్యూటీ స్పీకర్ రణ్‌బీర్ గాంగ్వా వాహనాన్ని అడ్డుకున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసులు దేశద్రోహం చట్టం కింద కేసు నమోదుచేశారు. జులై 11న డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు.. దాడిచేసి ధ్వంసం చేసినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. సిర్సా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అదే రోజు కేసు నమోదయ్యింది.

దేశద్రోహం కేసుతోపాటు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. రైతు ఉద్యమ నేతలు హర్‌చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ సహా 100 పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఆందోళన చేస్తున్న రైతులపై దేశద్రోహం కేసు నమోదుచేయడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తప్పుబట్టింది. ఇవన్నీ నిరాధారమైన.. పనికిమాలిన.. ఉద్దేశపూర్వక ఆరోపణలని మండిపడింది.

‘రైతు ఉద్యమ నేతలు హర్‌చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ సహా దాదాపు 100 మంది రైతులపై తప్పుడు కేసులు బనాయించారు.. వారిపై దేశద్రోహం వంటి క్రూరమైన సెక్షన్లు చేర్చారు.. ఎందుకంటే సిర్సాలో హరియాణా డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం వారు చేసిన తప్పు’ అని సంయుక్త కిసాన్ మోర్చా తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోపణలు ఎస్కేఎం తీవ్రంగా ఖండిస్తోంది.. హరియాణాలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం సూచనలతో ఇటువంటి కేసులు నమోదుచేశారని పేర్కొంది.

దేశద్రోహం చట్టంలోని సెక్షన్ 124ఏపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఈ కేసు విషయం వెలుగులోకి రావడం గమనార్హం. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం వలస తెచ్చుకున్నదని… స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దీని అవసరం ఏం ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

‘పేకాట ఆడేవారిపై సెక్షన్ 124 కింద కేసులు పెడుతున్నారు.. బెయిల్ రాకుండా కక్షసాధింపు చర్యలకు దిగుతారు.. అధికారదాహంతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారు.. వ్యవస్థలను, వ్యక్తులను బెదిరించేస్థాయికి దిగజారుతున్నారు.. ఫ్యాక్షనిస్టులూ ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు.. ప్రయోజనం కంటే దుర్వినియోగమే ఎక్కువగా ఉంది’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చంద్రబాబుని దారుణంగా తిట్టిన ఎంపీ.. ప్రకాశం ప్రజలు ఉమ్ముతారని.!

Thu Jul 15 , 2021
తెలుగు రాష్ట్రాల జల జగడం ఏపీలో రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ దారుణంగా తిట్టిపోశారు.